టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ చిత్రం 'ఛత్రపతి'. 2005లో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ 'ఛత్రపతి'కి ఇది రీమేక్. పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఎందుకనో చాలా కాలంగా ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే తాజాగా రిలీజ్ డేట్ తో కూడిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసి మేకర్స్ సర్ ప్రైజ్ చేశారు.
'ఛత్రపతి' హిందీ రీమేక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోమవారం ఉదయం విడుదల చేశారు. సముద్ర తీరంలో కండలు తిరిగిన దేహంతో శ్రీనివాస్ అటు వైపు తిరిగి నిల్చొని ఉన్న పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది. అలాగే ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు. విడుదలకు ఇంకా 6-7 వారాల సమయమే ఉండటంతో ఇప్పటి నుంచి ప్రమోషన్స్ లో దూకుడు పెంచే అవకాశముంది.
యూట్యూబ్ లో విడుదలైన డబ్బింగ్ చిత్రాలతో శ్రీనివాస్ హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయన నటించిన పలు హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. మరి 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న శ్రీనివాస్.. థియేటర్లలో కూడా హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందుతాడేమో చూడాలి.